మాస్కులు వాడేవారికి ఆ డేంజర్..ఎక్కువ సమయం వాడితే నష్టాలివే

కరోనా వల్ల అనేక కుటుంబాలు నష్టపోయాయి. చాలా మంది వీధిన పడ్డారు. మరి ఇంతటి భయంకరమైన కరోనాను అంతం చేయడానికి అందరూ విధిగా మాస్కులు వేసుకోవడం ఎంతో మంచిది. శానిటైజర్ వాడటం తప్పనిసరి. ఈ విషయాలను వైద్యులు సూచించడంతో చాలా మంది వీటిని పాటించి కరోనా సోకకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఇప్పుడు మరో సమస్య ముందుకు వచ్చింది.

వ్యాక్సినేషన్​, కొవిడ్​ గైడ్​లైన్స్​ పాటించడం వల్ల కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. అన్నీ బాగానే ఉన్నా ఎక్కువ కాలం మాస్కులు తొడగడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయనే కంప్లయింట్స్​ ఈ మధ్య పెరుగుతున్నట్టు డాక్టర్ల రిపోర్టులు చెబుతున్నాయి. అయితే మాస్క్​ తప్పకుండా వాడాలి. కానీ, కొన్ని జాగ్రత్తలతో మాస్కును కనుక వాడితే అనేక సమస్యలను తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

మాస్క్​ ఎక్కువ సేపు వాడటం వల్ల తలనొప్పి, డీహైడ్రేషన్​, అసౌకర్యం, అలర్జీ వంటి వాటి బారిన పడుతున్నామని చాలామంది చెబుతున్నారు. వాటికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలని డాక్టర్లు సూచిస్తున్నారు. టైట్​గా ఉన్న మాస్క్​ పెట్టుకోవద్దు. టైట్​ మాస్కులు చెవి దగ్గర నరాలను ఇబ్బంది పెడతాయి. దాని వల్ల తలనొప్పి వచ్చే అవకాశముంది. ఎక్కువ కాలం మాస్క్​ ధరించడం వల్ల టెంపోరోమ్యాండిబ్యులర్ జాయింట్ అంటే టీఎంజే– తలలో రెండు చెవుల మధ్య ఉండే జాయింట్​ లో నొప్పి పుడుతుంది. ఈ జాయింట్​తోనే దవడ కదులుతుంది. చెవుల దగ్గర నరాలు టైట్​ అయితే ఫస్ట్​ ఎఫెక్ట్​ అయ్యేది ఈ జాయింటే. దాంతో తలనొప్పి వస్తుంది.

మాస్క్​ పెట్టుకొని గంటలు గంటలు ఉంచుకోవద్దు. అప్పుడప్పుడు నోరు తెరుస్తుండాలి. నెమ్మదిగా నోటిని తెరుస్తూ, మూస్తూ చిన్నపాటి మౌత్​ ఎక్సర్​సైజ్​లా చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, ఆస్తమా, అలర్జీలు, స్కిన్​ అలర్జీలు ఉన్న వాళ్లకి మాస్క్ పెట్టుకోవడం కొంత కష్టంగా ఉంటుంది. వాళ్లు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ పెట్టుకున్నా దవడలు, నోటికి పని చెప్పాలి. అప్పుడప్పుడు దవడల్ని కదిలిస్తుండాలి. సర్జికల్​ మాస్క్​లు పెట్టుకొని బయటకు వెళ్తే ఇంటికొచ్చాక వాటిని పారేయాలి. మళ్లీ మళ్లీ వాడకుండా ఉండటం ఎంతో ఉత్తమం. వాటి మీద ఎక్కువ దుమ్ము, ధూళి పేరుకు పోయే ప్రమాదం ఉంది. అందుకే కొత్త వాటిని వాడుతూ ఉండాలి.

మాస్కు పెట్టుకోవడం సురక్షితమే. అయితే ఆ మాస్కును పెట్టుకునే విధానం సరిగా లేకుంటే అనేక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాలను తప్పించుకోవడానికి మాస్కులను, శానిటైజర్ ను జాగ్రత్తగా వినియోగించాలి. అప్పుడే అందరూ క్షేమంగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ సందేహంతోనే ఉన్నారు. మొత్తానికి మాస్కును ధరించకుండా ఉండకపోవడం కంటే మాస్కును వేసుకుని తగిన జాగ్రత్తతో ఉండటం ఎంతో ఉత్తమం. రాబోవు రోజుల్లో చలికాలం దంచేస్తుంది. కాబట్టి మాస్కులు ధరించడం వల్ల కొంత వెచ్చదనం కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే మాస్కును వేసుకోవడం మరువద్దు.

Leave a Comment